పాజిటివ్ సోషల్ న్యూస్ (4-12-2018)ముఖ్యాంశాలు : 4.93 లక్షల బోగస్‌ ఓట్లు తొలగించాం: సీఈవో రజత్ కుమార్, ఆరోగ్యశ్రీ సేవల పునరుద్ధరణ ప్రైవేటు ఆసుపత్రుల సంఘం ట్రస్టు సీఈఓతో చర్చలు సఫలం, గ్రామీణులకూ అన్నభోజనం, వచ్చే నెలలో 152 అన్న క్యాంటీన్ల ప్రారంభం, రాజకీయ నేతలారా.. మరో భూమి లేదు! హెచ్చరిస్తున్న పర్యావరణ ప్రేమికులు, 5న అంతరిక్షంలోకి జీశాట్‌-11 ఉపగ్రహం


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌ తెలిపారు. ఎన్నో సవాళ్లను అధిగమించి నెల రోజుల్లోనే ఎన్నికలకు సిద్ధమయ్యామని తెలిపారు. ‘మీట్‌ ది ప్రెస్‌’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల నిర్వహణ అనేది ఒక సవాల్‌ అన్నారు. న్యాయపరంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నామని చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షించిందన్నారు. మొత్తం 4.93 లక్షల బోగస్‌ ఓట్లు లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ఇప్పటికే అభ్యర్థుల క్రిమినల్‌ రికార్డులను సేకరించామని, పార్టీల మేనిఫెస్టోలు, హామీలను పరిశీలిస్తున్నామని రజత్‌కుమార్‌ చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ, ఉద్యోగులు, పింఛనుదారులు, పాత్రికేయుల ఆరోగ్య పథకాల సేవలను తిరిగి పునరుద్ధరిస్తున్నట్లు ప్రైవేటు ఆసుపత్రుల సంఘం ప్రకటించింది. ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈఓ మాణిక్‌రాజ్‌తో ఆదివారం జరిపిన చర్చలు సఫలం కావడంతో ఈ మేరకు సమ్మె విరమణ నిర్ణయాన్ని తీసుకున్నట్లు వెల్లడించింది. ట్రస్టు కార్యాలయంలో ప్రైవేటు ఆసుపత్రుల ప్రతినిధులతో సీఈఓ భేటీ అయ్యారు. గత నాలుగు రోజుల్లో ఆరోగ్యశ్రీ పథకం అమలుకు 150కోట్ల బకాయిలను అనుసంధాన ఆసుపత్రులకు విడుదల చేశామని ఈ సందర్భంగా సీఈఓ తెలిపారు. త్వరలోనే మిగిలిన బకాయిలను చెల్లిస్తామని, ప్రజాప్రయోజనాల దృష్ట్యా సమ్మె విరమించాలని ఆయన కోరారు. దీనిపై ప్రైవేటు ఆసుపత్రుల సంఘం సానుకూలంగా స్పందించింది. సీఈఓ హామీతో రోగుల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకొని ఆరోగ్యశ్రీ, ఉద్యోగులు, పాత్రికేయుల ఆరోగ్య పథకాల సేవలను తక్షణమే పునరుద్ధరించాలని నిర్ణయించినట్లుగా ప్రైవేటు ఆసుపత్రుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్‌ వి.రాకేశ్‌, డాక్టర్‌ టి.హరిప్రకాశ్‌ తెలిపారు. తక్షణమే 150 కోట్లు విడుదల చేయడమే కాకుండా మరో 150 కోట్లు నెలలోపు విడుదల చేస్తామని, మిగిలిన బకాయిలను ఈ ఆర్థికసంవత్సరం ముగిసేలోగా చెల్లిస్తామని సీఈఓ ఇచ్చిన హామీని సానుకూలంగా స్వీకరించామని, నిధుల విడుదలలో చొరవ చూపించిన మంత్రి లక్ష్మారెడ్డికి, వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులకు వారు ధన్యవాదాలు తెలిపారు.

కొత్త ఏడాది కానుకగా గ్రామీణ ప్రాంతాల్లో వచ్చే నెలలో అన్న క్యాంటీన్లు ప్రారంభం కాబోతున్నాయి. 13 జిల్లాల్లో 152 గ్రామీణ క్యాంటీన్ల ఏర్పాటు ప్రతిపాదనలను ప్రభుత్వం తాజాగా ఆమోదించడంతో అధికారులు తదుపరి చర్యలు తీసుకుంటున్నారు. ఒక్కో క్యాంటీన్‌లో ఉదయం, మధ్యాహ్నం, రాత్రి కలిపి రోజుకు వెయ్యి మందికి ఆహారాన్ని సరఫరా చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 21, పశ్చిమగోదావరిలో 19, గుంటూరులో 18 ఏర్పాటు చేయనున్నారు.

వాతావరణ మార్పులపై పోలెండ్‌లో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యాన నిర్వహిస్తున్న ‘సీఓపీ24’ను పురస్కరించుకుని బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో పర్యావరణ ప్రేమికులు కదంతొక్కారు. 65 వేలమంది ఆందోళనలో పాల్గొన్నారు. బెల్జియం చరిత్రలో ఇంతమంది వాతావరణ మార్పులపై ఆందోళనలో పాల్గొనడం ఇదే తొలిసారి. రాజకీయ నాయకులు ప్రజల కోసం పనిచేయాలని, మనకు మరో భూమిలేదని గుర్తుంచుకోవాలని నినాదాలు చేశారు.వాతావరణ మార్పులకు సంబంధించి చాలా ఆందోళనకరమైన హెచ్చరికలు వెలువడుతున్న నేపథ్యంలో ఆదివారం పోలెండ్‌లో ఐరాస వాతావరణ సదస్సు ప్రారంభమైంది. ముంచుకొస్తున్న ముప్పును ఎదుర్కొనేందుకు కార్యాచరణను రూపొందించడం దీని ఉద్దేశం. దాదాపు 200 దేశాలకు చెందిన ప్రతినిధులు ఇందులో పాల్గొంటున్నారు.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అత్యంత బరువైన ఉపగ్రహం జీశాట్‌-11ను డిసెంబర్‌ 5న ఫ్రెంచ్‌ గయానా నుంచి అంతరిక్షంలోకి పంపనుంది. 5854 కిలోల బరువు ఉండే ఈ ఉపగ్రహాన్ని బుధవారం ఉదయం 2.07 గంటల నుంచి 3.23 గంటల మధ్యలో ఏరియన్‌-5 వాహకనౌకతో అంతరిక్షంలోకి పంపనున్నారు. కొత్త తరం ప్రయోగాలకు వేదికగా ఉపయోగపడే ఈ ఉపగ్రహం దేశవ్యాప్తంగా బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు అందించేందుకు ఉపయోగపడుతుంది. మే 25నే ఈ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపాల్సి ఉన్నప్పటికీ సాంకేతిక కారణాల వల్ల బుధవారానికి వాయిదా వేసినట్లు ఇస్రో తెలిపింది. జీశాట్‌-11 ఉపగ్రహం 15 ఏళ్లకు పైగా సేవలు అందించనుంది.

ఇవి ఈనాటి పాజిటివ్ సోషల్ న్యూస్ అప్‌డేట్స్ మరిన్ని ఫ్రెష్ అప్‌డేట్స్ తో మళ్లీ కలుసుకుందాం ... అంతవరకూ...