పాజిటివ్ సోషల్ న్యూస్ (1-12-2018)ముఖ్యాంశాలు : బుల్లెట్‌ రైలు కోసం భూమి ఇచ్చిన ఎన్నారై సవితా బెన్‌, వంటగ్యాస్‌పై ఊరట, రాయితీ సిలిండర్‌పై రూ. 6.52 తగ్గింపు, నెలాఖరులోగా భూ పరిష్కారం, కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు ఆదేశం, బాహుదాలోకి వంశ‘ధార’! ఉత్తరాంధ్రలో మరో అనుసంధానం, సృజనను వెలికితీసే బాలోత్సవ్‌, 570 పాఠశాలల నుంచి పాల్గొన్న విద్యార్థులు


కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు కోసం గుజరాత్‌కు చెందిన ఓ ఎన్నారై భూమిని విరాళంగా ఇచ్చారు. జర్మనీలో ఉంటున్న ఆమె ఇందుకోసం ప్రత్యేకంగా భారత్‌కు వచ్చారు. కాగా.. బుల్లెట్‌ రైలు కోసం గుజరాత్‌లో ప్రభుత్వానికి భూమి ఇచ్చిన తొలి వ్యక్తి ఆమే కావడం విశేషం.

గుజరాత్‌లోని చన్సాద్‌ గ్రామానికి చెందిన సవితా బెన్‌ 33ఏళ్ల క్రితం జర్మనీ వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఆమెకు చన్సాద్‌లో 71 ఎకరాల భూమి ఉంది. అందులో నుంచి 29.50 ఎకరాల భూమిని రూ. 30,243.3 ధరకు నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్ లిమిటెడ్‌ కు ఇచ్చారు. ‘ఈ ప్రాజెక్టు కోసం భూమి ఇచ్చేందుకు సవిత ప్రత్యేకంగా భారత్‌కు వచ్చారు. ఇందుకు ఆమెకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. గుజరాత్‌లో మేం సేకరించిన తొలి భూమి ఇదే’ అని NHSRCL అధికార ప్రతినిధి ధనంజయ్‌ కుమార్‌ తెలిపారు. 

చలికాలంలో వంటగ్యాస్‌  వినియోగదారులకు ఊరట. 6 నెలలుగా పెరుగుతూ వస్తున్న గ్యాస్‌ ధర శుక్రవారం తగ్గింది. మార్కెట్‌ ధర తగ్గడంతో 14.2 కేజీల రాయితీ సిలిండర్‌పై శుక్రవారం అర్థరాత్రి నుంచి రూ.6.52 మేర భారం తగ్గింది. దేశ రాజధాని దిల్లీలో సిలిండర్‌ ధర  507 రూపాయిల 42 పైసల నుంచి రూ.500 రూపాయిల 90 పైసలకి చేరినట్లు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌  తెలిపింది. గత జూన్‌ నుంచి రాయితీ వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర క్రమేపీ రూ. 14.13 మేర పెరుగుతూ వచ్చింది. నవంబరు 1న కూడా 2 రూపాయిల 94 పైసలు పెరిగిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గడం, రూపాయి కొంత బలపడటంతో రాయితీయేతర లేదా మార్కెట్‌ ధర ఎల్‌పీజీ సిలిండర్‌ ధర ఒక్కసారిగా 133 రూపాయిల తగ్గినట్లు ఐవోసీ వెల్లడించింది. వాస్తవంగా వంటగ్యాస్‌ వినియోగదారులంతా మార్కెట్‌ ధరలకే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అర్హులకు ప్రభుత్వం వారి ఖాతాల్లో రాయితీని జమ చేస్తుంది. సంవత్సరానికి 12 సిలిండర్లకు ఈ రాయితీ అందుతుంది.

డిసెంబరు నెలాఖరులోగా చుక్కలు, నిషిద్ధ భూములు, కో-ఆపరేటివ్‌, పట్టణ స్థలాలు, ఇతర భూముల సమస్యలను పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ... భూదార్‌ ప్రయోజనాలపై అన్ని రెవెన్యూ కార్యాలయాల్లో బోర్డులు, హోర్డింగులు ఏర్పాటు చేయాలన్నారు. భూముల వివరాలను ఎవరూ మార్చకుండా ఆన్‌లైన్‌ విధానాన్ని పటిష్ఠం చేయాలని సూచించారు. రాష్ట్రానికి వచ్చే కేంద్ర నిధుల సద్వినియోగంలో అధికారులు అలసత్వాన్ని ప్రదర్శించవద్దని హెచ్చరించారు.  యూసీ , ఇతర వివరాలు పంపడంలో ఏమరుపాటు వద్దన్నారు. ఇతర రాష్ట్రాలు ఈ విషయంలో ముందంజలో ఉన్నాయన్నారు. కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో క్యాన్సర్‌ విభాగం ఏర్పాటుకు కేంద్రం నుంచి 18 కోట్లు రావాల్సి ఉండగా... రాష్ట్రం నుంచి వివరాలు వెళ్లడంలో జాప్యం జరుగుతోందని అధికారులు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు.

ఉత్తరాంధ్రలో మరో నదీ అనుసంధానానికి రంగం సిద్ధమయింది. వంశధారలో వృథాగా పోతున్న వరద జలాలను బాహుదా నదికి మళ్లించి.. ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా సరిహద్దులో కరవు నేలకు నీటిని అందించనున్నారు. 2015లో శ్రీకాకుళం జిల్లా పరిస్థితులపై ముఖ్యమంత్రి సమీక్ష సందర్భంగా ఈ ఆలోచన పురుడు పోసుకుంది. అనంతరం ఆ ప్రతిపాదనపై సమగ్ర సర్వే చేసి,  డీపీఆర్‌ ను తాజాగా సిద్ధం చేశారు. మొత్తం 25 టీఎంసీల వరద జలాలను వినియోగించుకునేలా హిరమండలం జలాశయం నుంచి 118 కిలోమీటర్ల మేర ఒక హైలెవెల్‌ కాలువ తవ్వి ఆ నీటిని ఇచ్ఛాపురం వరకు మళ్లిస్తారు. 

ప్రస్తుతం వంశధార రెండో భాగం రెండో దశలో భాగంగా హిరమండలం జలాశయానికి నీరు తీసుకువస్తున్నారు. ఈ జలాశయంలో 19.5 టీఎంసీల నీటిని నిల్వ చేయనున్నారు. ఇక్కడి నుంచే కాలువ తవ్వి బాహుదా నది వరకు తీసుకువెళ్తారు. హిరమండలం మండలంలోని పెద్ద సంకిలి గ్రామం నుంచి ఈ కాలువ ప్రారంభమవుతుంది. రెండు భాగాలుగా ఈ ప్రాజెక్టును చేపట్టే అవకాశం ఉంది. 

విద్యార్థుల్లో అంతర్లీనంగా దాగున్న సృజనను బయటికి తీసుకురావడానికి సాంస్కృతిక, సాహితీ కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ కె.సంధ్యారాణి పేర్కొన్నారు. గుంటూరు జిల్లా నంబూరులోని వీవీఐటీ కళాశాల ఆధ్వర్యంలో భాషా సాంస్కృతిక శాఖ, ఆచార్య నాగార్జున వర్సిటీ, ఏపీఎన్‌ఆర్టీ సహకారంతో మూడు రోజుల ‘బాలోత్సవ్‌-2018’ పండగ శుక్రవారం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా పాల్గొన్న సంధ్యారాణి మాట్లాడుతూ ఈ తరహా కార్యాక్రమాల్లో పాల్గొనడం వల్ల చదువుతో పాటు సమాజంపై అవగాహన ఏర్పడుతుందన్నారు. మరో అతిథి విశ్రాంత డీజీపీ మాలకొండయ్య మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల విద్యార్థులు ఒకరి నుంచి మరొకరు కొత్త విషయాలు నేర్చుకుంటారని.. తద్వారా ప్రపంచంలో ఎక్కడికెళ్లినా రాణిస్తారన్నారు. 1717వ సంవత్సరంలో జర్మనీలో ప్రాథమిక విద్యపై చట్టం తీసుకొచ్చారని, 1890లోనే జపాన్‌లో 60శాతం అక్షరాస్యత శాతం ఉందని, అందువల్ల ఆ రెండు దేశాలు ఎంతగానో అభివృధ్ధి చెందాయని గుర్తు చేశారు. చిన్న వయసులోనే పిల్లలకు మాతృభాష, సాహిత్యంపై ప్రేమ పెంచడం వల్ల ఎంచుకున్న రంగాల్లో ప్రతిభ కనబరుస్తారని భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డా.విజయభాస్కర్‌ అన్నారు. కొత్తగూడెం బాలోత్సవ్‌ కన్వీనర్‌ వాసిరెడ్డి రమేష్‌బాబు మాట్లాడుతూ గత 25 ఏళ్లుగా కొత్తగూడెంలో బాలోత్సవ్‌ నిర్వహిస్తూ వచ్చామని, రెండు తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని ప్రాంతాల్లో ఈ తరహా కార్యక్రమాలు నిర్వహించాల్సిన ఆవశ్యకత  ఉందన్నారు.

ఇవి ఈనాటి పాజిటివ్ సోషల్ న్యూస్ మరిన్ని కొత్త అప్‌డేట్స్ తో మళ్లీ కలుసుకుందాం ... అంతవరకూ..